MOVIE NEWS
Trending

నా ‘యువరాజు’కి 20 ఏళ్లు..

నా కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వంలో, శ్రీ ‘బూరుగపల్లి శివరామకృష్ణ’గారు నిర్మాతగా, ‘శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్’ బ్యానర్‌పై, ‘సూపర్‌స్టార్’ శ్రీ ‘ఘట్టమనేని మహేష్‌బాబు’ కథానాయకుడిగా, అందాల తారలు ‘సిమ్రాన్’ మరియు ‘సాక్షి శివానంద్’గార్లను కథానాయికలుగా, నా ‘గురువు’గారైన కీ॥శే॥ శ్రీ ‘వేటూరి సుందరరామమూర్తి’గారి గేయ రచనలతో, శ్రీ ‘రమణ గోగుల’గారి సంగీత సారథ్యంలో, శ్రీ ‘చింతపల్లి రమణ’, ‘రాజేంద్ర కుమార్’గార్ల మాటలతో.. 14 ఏప్రిల్ 2000 నాడు విడుదలైన ‘యువరాజు’ తెలుగు చలనచిత్రానికి నిన్నటికి సరిగ్గా 20 ఏళ్లు నిండి, నేటితో 21 సంవత్సరంలోకి అడుగు పెట్టింది.

నేను కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం వహించిన చిత్రాలలో ‘యువరాజు’ చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే.. కథానాయకుడుగా తన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ షూటింగ్ దశలో ఉండగానే నేను చెప్పిన 20 నిమిషాల నిడివి గల ఓ ముక్కోణపు ప్రేమ మరియు బిడ్డ భావోద్వేగాలు, మనోభావాలతో ముడిపడ్డ సున్నితమైన మూలకథని విని, ‘మహేష్‌బాబు’ ఎంతో సాహసంతో తన 2వ చిత్రంగా ‘యువరాజు’ చిత్రాన్ని ఓకే చెయ్యడమే. అటువంటి వైవిధ్యమైన భావోద్వేగాలు ఉన్న కథని, చిన్న వయసులోనే అర్థం చేసుకున్న ‘మహేష్‌బాబు’ మానసిక పరిపక్వత, పరిణితిలను చూసి నాకు ఎంతో ఆశ్చర్యం కలిగి, తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఈ కథని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులకు నచ్చే విధంగా తియ్యాలి అన్న ఒక దృఢ సంకల్పంతో కూడిన సవాలుగా స్వీకరించాను.

నిజంగా చెప్పాలంటే.. నా 2వ చిత్రం ‘సీతారామరాజు’ రీ రికార్డింగ్ దశలో ఉండగానే ప్రముఖ నిర్మాత శ్రీ ‘అశ్వనీదత్’గారు చూసి, ‘సూపర్‌స్టార్’ ‘కృష్ణ’గారితో నా దర్శకత్వ ప్రతిభ గురించి మంచిగా చెప్పటం జరిగింది. అదే సమయానికి ‘కృష్ణ’గారు ‘పద్మాలయా స్టూడియోస్’ బ్యానర్‌పై.. తను మరియు ‘మహేష్‌బాబు’లపై ‘రాజకుమారుడు’ తర్వాత ఓ చిత్రాన్ని నిర్మించాలి అన్న ఆలోచనలో ఉండటంతో, వారిద్దరిపై కథ చెప్పమని నన్ను పిలిపించారు. సరిగ్గా వాళ్ళిద్దరినీ దృష్టిలో ఉంచుకుని, నేను ఎప్పుడో రాసుకున్న భారీ వ్యయంతో కూడిన ఓ పీరియాడిక్ లవ్, మెలోడ్రామా, యాక్షన్ కథను చెప్పటం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కానీ, ఆ కథని చెప్పే విధానంతో ‘మహేష్‌బాబు’కి నాపై, నా ప్రతిభపై ఓ నమ్మకం ఏర్పడింది. దాంతో తన 2వ చిత్రానికి దర్శకుడిగా నన్ను ఫిక్స్ చేస్తూ వేరొక కథ చెప్పమన్నారు. ఈసారి నేను ఒక సోషల్ యాక్షన్ అండ్ లవ్ అంశాలతో కూడిన ఒక కథ మరియు ‘యువరాజు’ చిత్ర కధలను చెబుదామని వెళ్లి.. ముందుగా ‘యువరాజు’ చిత్ర మూలకథని చెప్పడం జరిగింది. తను వెంటనే 2వ కథ గురించి అడగకుండా ‘యువరాజు’ కథని ఓకే చేయడంతో, ఆయన అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తూ ‘యువరాజు’ చిత్రానికి కార్యరూపం దాల్చటం జరిగింది.

ఒరిజినల్‌గా ఇంత సున్నితమైన కథలోని ఇద్దరు కథానాయికల్ని, బిడ్డ పాత్రధారుడిని సరికొత్త వారిని పరిచయం చేయడం ద్వారా కథలోని పాత్రలను ప్రేక్షకులకి అతి చేరువగా తీసుకువెళ్ళవచ్చునని మేము అనుకోవటం జరిగింది. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ‘సిమ్రాన్’, ‘సాక్షి శివానంద్’గార్లను మరియు అంతకు కొన్ని సంవత్సరాల కిందట ‘చూడాలని ఉంది’ చిత్రంలో ‘చిరంజీవి’గారికి బిడ్డగా నటించిన ‘మాస్టర్ తేజ’ని.. పైన నేను చెప్పిన పాత్రధారులుగా తీసుకోవడం జరిగింది. కథానాయకుడు కాకముందు ‘చైల్డ్-ఆర్టిస్ట్‌’గానే ‘మహేష్‌బాబు’ యాక్ట్ చేసిన సినిమాలు బాక్స్-ఆఫీసు దగ్గర అప్పటి అగ్ర కథానాయకుల చిత్రాల కలెక్షన్లకి తీసిపోకుండా వసూలు చేయడం గమనార్హం. ఇంతలో తను కథానాయకుడిగా నటించిన మొట్ట మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత పెరిగిన అంచనాల మేరకు మా ‘యువరాజు’ కథకు మరికొన్ని కమర్షియల్ హంగులను జత చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే.. ఈ చిత్రంలోని 8 పాటలు 3 మ్యూజిక్ బిట్స్.. మొత్తం 11 పాటలలో.. కొన్ని కమర్షియల్ తరహా, మరి కొన్ని సందర్భ శుద్ధి తరహా మిశ్రమాల మేళవింపులో ఉండటం ఓ ప్రత్యేకత. ‘మహేష్‌బాబు’కు ఉన్న అందం, సుకుమారత్వం, సౌమ్యం మరియు చిలిపితనానికి చిహ్నంగా మా చిత్రంలోని ‘గుంతలకిడి’ పాటలో తనని ‘శ్రీకృష్ణ భగవానుడు’ రూపంలో చూపించటం మరొక ప్రత్యేకత.

ఇక ఈ చిత్ర విడుదల విషయానికొస్తే.. మా చిత్రానికి సరిగ్గా 9 రోజుల ముందు అంటే ఏప్రిల్ 5న ‘నాగార్జున’గారి ‘నువ్వు వస్తావని’ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయ్యింది, మా చిత్రానికి సరిగ్గా 6 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 20న ‘పవన్ కళ్యాణ్‌’గారి ‘బద్రి’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది మరియు మా చిత్రం విడుదల రోజే అంటే సరిగ్గా ఏప్రిల్ 14నే దిగ్దర్శకులు ‘మణిరత్నం’గారి ‘సఖి’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇటువంటి సూపర్ హిట్ చిత్రాల మధ్యలో విడుదలై కూడా ప్రేక్షకుల మన్ననలు పొందటమే కాక, విజయవంతమై 77కి పైగా కేంద్రాలలో అర్ధ శతదినోత్సవం మరియూ 19కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్నదంటే దానికి కారణం ‘మహేష్‌బాబు’కి ఉన్న అచంచలమైన ఇమేజ్ మరియు ఈ కథలో ఇమిడి ఉన్న మెలోడ్రామా యొక్క బలమే అని నా ప్రగాఢ నమ్మకం.

అందుకే నా చిత్రాలలో ‘యువరాజు’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటూనే ఉంటుంది. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛని, గౌరవాన్ని ఇవ్వడంలో మనకున్న అతి కొద్ది మంది కథానాయకులలో ‘మహేష్‌బాబు’ ముఖ్యులు. ‘యువరాజు’ చిత్రం సందర్భంగా తనతో కలిసి పనిచేసిన కాలం నేను ఎప్పటికీ మర్చిపోలేని, ఎప్పటికీ నాకు మరపునకురాని, ఓ మధురమైన జ్ఞాపకం లాంటిది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి కష్టపడి పనిచేసిన నాతోటి సాంకేతిక నిపుణులందరికీ మరియు నటీనటులందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ..

మీ
వైవిఎస్ చౌదరి
14.04.2020.

పదిలం: అన్న ‘ఎన్‌. టి. ఆర్‌.’ అభిమానినైన నాతో.. నేను పనిజేసిన అందరి హీరోల అభిమానులు ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. వారితో నేనూ అంతే ఆత్మీయంగా ఉండేవాడిని. నా మొదటి 2 చిత్రాలకు నటసామ్రాట్‌ ‘ఎ. ఎన్‌. ఆర్‌.’గారు & యువసామ్రాట్‌ ‘నాగార్జున’గార్ల అభిమానులే శతదినోత్సవ వేడుక జరిపి 100 రోజుల జ్ఞాపికలు ఇచ్చారు. అలాగే ‘యువరాజు’ చిత్రానికి కూడా సూపర్‌స్టార్‌ ‘కృష్ణ’గారు & సూపర్‌స్టార్‌ ‘మహేష్‌బాబు’గార్ల అభిమానులే శతదినోత్సవ వేడుక జరిపి 100 రోజుల జ్ఞాపికలు ఇచ్చారు. ఆ జ్ఞాపికలు, జ్ఞాపకాలు ఇప్పటికీ నా దగ్గర, నాలో పదిలంగానే ఉన్నాయి.

SuperStar

Maheshbabu

SuperStarMaheshbabu

MaheshbabuMovieYuvaraju

Yuvaraju

20YearsOfYuvaraju

YuvarajuTeluguMovie

YuvarajuShootingMuhurathPictures

SuperStarKrishnaFans

SuperStarMaheshbabuFans

YVSChowdary

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close