Movie ReviewsREVIEWS

‘మళ్లీ పెళ్లి’ సినిమా రివ్యూ ‘Malli Pelli’ Movie Review

'Malli Pelli' Movie Review

Malli-Pelli

నరేష్-పవిత్రా లోకేష్ జంటగా నటించిన మూవీ ‘మళ్లీ పెళ్లి’. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఏంటో తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

నటినటులు:నరేష్, పవిత్రా లోకేష్, వనితా విజయ్ కుమార్ తదితరులు

దర్శకత్వం:MS రాజు

నిర్మాత:నరేష్ విజయకృష్ణ

సంగీతం:సురేష్ బొబ్బిలి, అరుల్ దేవ్

సినిమాటోగ్రఫీ:బాలిరెడ్డి

Rating:- 2.5/5

నరేష్-పవిత్రా లోకేష్.. ఈ జోడీ పేరు చెప్పగానే నెటిజన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతారు. ఆ కాంబోకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. రియల్ లైఫ్ లో వీళ్లిద్దరి మధ్య ఏముందనేది ఇప్పటికీ చాలామందికి పెద్ద క్వశ్చన్. ఇప్పుడు దానికి ఆన్సర్ అన్నట్లు ‘మళ్లీ పెళ్లి’ అనే మూవీ తీశారు. గత కొన్నిరోజుల నుంచి హడావుడి చేసిన ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. అందరూ అనుకుంటున్నట్లు ఇది నరేష్-పవిత్రా బయోపిక్కా? లేదా ఫిక్షనల్ స్టోరీతో తీశారా అనేది తెలియాలంటే లేటు చేయకుండా ఈ రివ్యూ చదివేయండి. అసలు విషయం మీకే అర్థమైపోతుంది!

ప్రముఖ హీరో, నటుడు నరేంద్ర (సీనియర్ నరేష్), అతడి మూడో భార్య సౌమ్య సేతుపతి (వనితా విజయ్ కుమార్) మధ్య గొడవలు జరుగుతుంటాయి. వేలకోట్లు ఆస్తి ఉన్నాసరే నరేంద్రకు ప్రశాంతత ఉండదు. సరిగ్గా ఆ టైంలో ఆయనకు ఒకప్పటి కన్నడ హీరోయిన్, నటి పార్వతి (పవిత్రా లోకేష్) పరిచయమవుతుంది. ఫస్ట్ నార్మల్ గానే ఉంటారు. కొన్నాళ్లకు లవ్ లో పడతారు. మాససికంగా ఒక్కటవుతారు. దీంతో నరేంద్రని సౌమ్య టార్గెట్ చేస్తుంది. ఇంతకీ నరేంద్ర-సౌమ్య మధ్య గొడవలేంటి? పార్వతికి తనతో పదకొండేళ్లు సహజీవనం చేసిన ఫణింద్రతో(అద్దూరి రవివర్మ) ఏంటి గొడవ? ఫైనల్ గా ఏం జరిగింది అనేది ‘మళ్లీ పెళ్లి’ స్టోరీ.

విశ్లేషణ:

2023 న్యూయర్.. పవిత్రా లోకేష్ ని లిప్ కిస్ చేస్తున్న వీడియోని నరేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. తెలుగు ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇదే అనుకుంటే.. మరికొన్నాళ్లకు పెళ్లికొడుకు-పెళ్లి కూతురిగా కనిపించి అవాక్కయ్యేలా చేశారు. నిజంగా మ్యారేజ్ చేసుకున్నారా అని చాలామంది అనుకున్నారు. కానీ అది ‘మళ్లీ పెళ్లి’ మూవీ ప్రమోషన్ కోసమని తెలిసి అందరూ కాస్త రిలాక్స్ అయ్యారు. ఇక ట్రైలర్ చూడగానే నరేష్-పవిత్రా లోకేష్ ఎపిసోడ్ గురించి తెలిసిన వాళ్లంతా ఈ సినిమా ఎప్పుడొస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ వెయిట్ చేశారు. ఇప్పుడు వాళ్లని సినిమా మంచిగా ఎంటర్ టైన్ చేస్తోంది. కానీ కొన్ని విషయాలు మాత్రం కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.

ఫస్టాప్ విషయానికొస్తే.. నరేంద్ర, పార్వతి మధ్య ఓ ఎమోషనల్ పాయింట్ తో మొదలుపెట్టి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లిపోయారు. అలా ప్రేక్షకుడిని సినిమాలో లీనమయ్యేలా చేశారు. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ నేచురల్ గానే ఎంటర్ టైన్ చేస్తుంది. అందుకు తగ్గట్లే ‘మళ్లీ పెళ్లి’ తీశారు. నరేంద్ర తల్లి విమల, ఆమె లైఫ్ పార్ట్ నర్ సూపర్ స్టార్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ లో పార్వతి లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ప్రేక్షకులు కొత్తగా అనిపిస్తాయి. స్టోరీకి అవే సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయి బలం చేకూర్చాయి. సినిమాటిక్ సీన్స్, డ్రామా కాస్త రొటీన్ గా అనిపిస్తాయి. కానీ నరేష్-పవిత్రా లోకేష్ బంధానికి పాజిటివ్ జస్టిఫికేషన్ ఇచ్చేలా సినిమా ఎండ్ అవుతుంది.

Malli-Pelli
Malli-Pelli

‘మళ్లీ పెళ్లి’ సినిమా తన బయోపిక్ కాదని నరేష్ చెప్పారు గానీ సినిమా చూస్తుంటే మాత్రం ఆయన లైఫ్ లో జరిగిన వాటినే తీశారని ఈజీగా అర్థమైపోతుంది. చూస్తున్నంతసేపు నరేష్ తప్పేం లేదు అంతా ఆయన మూడో భార్య రమ్య రఘుపతిదే తప్పు అనిపించేలా తీశారు. ఇందులో నిజానిజాలు మాత్రం ఆ దేవుడికే ఎరుక. దీనికి హీరో కమ్ ప్రొడ్యూసర్ నరేష్ కావడం వల్లో ఏమో గానీ సినిమా అంతా పాజిటివ్ గానే ఉంటుంది. దాదాపు అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ డైరెక్టర్ ఎంఎస్ రాజు ‘మళ్లీ పెళ్లి’తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్ లో మనం ఆల్రెడీ టీవీలో చూసిన కొన్ని సీన్లు మళ్లీ బిగ్ స్క్రీన్ ప్లే అవుతున్నట్లు అనిపిస్తుంది. అది మైనస్ అని చెప్పుకోవచ్చు.

నటీనటుల పనితీరు:

నరేష్-పవిత్రా లోకేష్ ఇందులో యాక్ట్ చేయలేదు. జస్ట్ జీవించేశారు. ఎందుకంటే ఇవి వాళ్ల రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి. నరేష్ మూడో భార్య రోల్ చేసిన వనితా విజయ్ కుమార్ విలనిజంతో ఆకట్టుకుంది. యంగ్ పార్వతిగా చేసిన అనన్య నాగళ్ల.. గ్లామర్ తో ఇచ్చిపడేసింది. రెయిన్ సాంగ్ లో ఇంతకు ముందెన్నడు చూడని విధంగా కనిపించి సెగలు పుట్టించింది. విజయనిర్మల క్యారెక్టర్ లా అనిపించిన విమలమ్మ పాత్రలో జయసుధ, సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో శరత్ బాబు ఓకే అనిపించారు. వాళ్లకు పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కలేదు. మొత్తం సినిమా అంతా కూడా నరేష్-పవిత్రా లోకేష్ క్యారెక్టర్స్ మాత్రమే హైలెట్ అయ్యేలా చూసుకున్నారు.

టెక్నికల్ టీమ్ పనితీరు:

‘మళ్లీ పెళ్లి’ స్టోరీ అందరికీ తెలిసిందే అయినా డైరెక్టర్ ఎంఎస్ రాజు.. ఫ్రంట్- బ్యాక్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నారు. ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా చేశారు. కొన్ని సీన్లని చాలా బోల్డుగా తీశారు. ట్రైలర్ లో ఉన్నట్లే నరేష్ వయసుపైనా సెటైర్లు వేశారు. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. బాలిరెడ్డి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. స్క్రీన్ కి ఫుల్ కలరింగ్ తీసుకొచ్చింది. సీన్లకు తగ్గట్లు లైటింగ్ ఎఫెక్ట్ బాగా అనిపించింది. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. నరేష్ సొంత సినిమాకు డబ్బులు బాగానే పెట్టాడు. నిర్మాణ విలువలు కాస్ట్ లీగా ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే నరేష్-పవిత్రా లోకేష్ ఎపిసోడ్ గురించి ఓ ఐడియా ఉంటే ‘మళ్లీ పెళ్లి’ నచ్చుతుంది. లేనివాళ్లు సినిమాకు దూరంగా ఉండటం బెటర్.

ప్లస్ పాయింట్స్:

  • నరేష్-పవిత్రా లోకేష్
  • MS రాజు డైరెక్షన్
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • క్లైమాక్స్ లో కొన్ని సీన్స్

చివరగా: కలర్ ఫుల్ పెళ్లి.. విత్ రివేంజ్!

రేటింగ్: 2.5

Tags

Related Articles

Back to top button
Close
Close