
‘ఓజీ’… సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan joins the shoot of his action drama with director Sujeeth in Mumbai

* ముంబైలో ప్రారంభమైన ‘ఓజీ’ చిత్రీకరణ
* ఏప్రిల్ 15 నుంచి నెలాఖరు వరకు మొదటి షెడ్యూల్
* యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ప్రతిభగల యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ డ్రామాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ‘ఓజీ'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్)గా ప్రాచుర్యం పొందింది. జనవరి 30న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రకటన వచ్చినప్పటి నుంచే పవన్ కళ్యాణ్ అభిమానులలో, సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు పాల్గొంటారా అని అభిమానూలు, ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆరోజు రానే వచ్చింది. ‘ఓజీ’ సెట్స్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు.
ఏప్రిల్ 15 నుంచి ‘ఓజీ’ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. తాజాగా ఈ మూవీ సెట్స్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మంగళవారం ఉదయం మేకర్స్ ఒక ఫోటోను వదిలారు. అందులో బ్లాక్ హూడీ ధరించి, కళ్లద్దాలతో పవన్ కళ్యాణ్ చాలా స్టైల్ గా కనిపిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి మొదలైన ఈ షెడ్యూల్ లో ముంబై మరియు పరిసర ప్రాంతాల్లో నెలాఖరు వరకు చిత్రీకరణ జరగనుంది. పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
భారీస్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ‘భీమ్లా నాయక్’కి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ బలానికి, స్టార్డమ్ కి సరిగ్గా సరిపోయే కథతో యాక్షన్ డ్రామాగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం.. థమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం మరియు అద్భుతమైన ఇతర సాంకేతిక వర్గం ప్రతిభ తోడై అటు యాక్షన్ ప్రియులను, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులను అలరిస్తుందని నిర్మాత డీవీవీ దానయ్య ఎంతో నమ్మకంగా ఉన్నారు.
సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్
సంగీతం: ఎస్ థమన్
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
నిర్మాత: డీవీవీ దానయ్య
రచన, దర్శకత్వం: సుజీత్
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్