
డిసెంబర్ 24న ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం అందుకోనున్న మురళీమోహన్, జయచిత్ర!
Murali Mohan, Jayachitra to receive NTR Shatabdi Film Award on December 24!



ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగు వారందరూ అన్నగారుగా పిలుచుకొనే నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సీనియర్ నేత ఆలపాటి రాజా ఆధ్వర్యంలో తెనాలిలో జరుగుతున్న శకపురుషుడు ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాల్లో భాగంగా ఈనెల 24వ తేదీ సినీ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, ప్రముఖ సినీనటి జయచిత్ర ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాన్ని అందుకోనున్నారు. అదే రోజు ఉదయం 11 గంటలకు తెనాలి నాజర్ పేట ఎన్విఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పుష్కర మహోత్సవ సభ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు హాజరు కానున్నారు. శ్రీశ్రీ లక్ష్మీ నారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ శ్రీమతి పెసర్లంక వసంత దుర్గ శిష్య బృందం చేత కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరగనున్నాయి. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ రచయిత మహమ్మద్ సాబీర్ షా సభా పరిచయలుగా, మాజీ మంత్రి ఆలపాటి రాజా సభాధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. సినీ రచయిత సాయి మాధవ్ బుర్ర సభ ప్రారంభకులుగా వ్యవహరించబోతున్న ఈ సభకు హైకోర్టు జస్టిస్ సుధారాణి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరు కానున్నారు. ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి పురస్కార ప్రధాన వ్యవహరించబోతున్న ఈ కార్యక్రమంలో వై పాణీరావు ఎన్టీఆర్ అభిమాన సత్కార పురస్కారాన్ని అందుకోనున్నారు.