EventMOVIE NEWSSpecial Bites

అందరికీ అందుబాటులో టికెట్ ధర వుండటం ఇండస్ట్రీకి ఆరోగ్యకరం: ‘తారకరామ’ థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ

Affordable ticket price is healthy for the industry: Nandamuri Balakrishna at the re-opening of 'Tharakarama' theatre.

*’తారకరామ’ థియేటర్ అమ్మనాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం. తారకరామ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది.

కాచిగూడలోని ‘తారకరామ’ థియేటర్ వైభవంగా పునః ప్రారంభించారు నటసింహ నందమూరి బాలకృష్ణ. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పై వున్న అభిమానంతో  ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ని పునరుద్ధరించారు. ఈ రోజు ‘ఏషియన్ తారకరామ’ థియేటర్ పునః ప్రారంభ కార్యక్రమం నందమూరి బాలకృష్ణ గారు, ప్రొడ్యూసర్ శిరీష్ గారి చేతులు మీదగా గ్రాండ్ గా జరిగింది.

అనంతరం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా కన్నతండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. తారకరామ థియేటర్ కి ఎంతో గొప్ప చరిత్ర వుంది. నాన్నగారు ఏది చేసిన చరిత్రలో నిలిచిపోయేటట్లు చేస్తారు. అది ఆయన దూరద్రుష్టి. ఆయన నటిస్తుంటే జానపదాలు జావళీలు పాడాయి. పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. సాంఘికాలు సామజవరగమనాలు పాడాయి. కళామతల్లి కళకళలాడింది. నటనకు జీవం పోసిన నటధీశాలుడు నందమూరి తారకరామారావు గారు.  తెలుగువారి స్ఫూర్తి ప్రదాత తారకరామారావు గారు. చిత్ర పరిశ్రమ మద్రాస్ లో వున్నప్పుడు ఇక్కడ  ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రారంభించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రస్థానం మొదలుపెట్టారు. ఇక్కడ ఎన్టీఆర్ ఎస్టేట్ కూడా ఒక పర్యటక స్థలంగా వుండేది. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. ఈ థియేటర్ కి ఒక చరిత్ర వుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మా అమ్మగారి జ్ఞాపకార్ధం కట్టిన ఓ దేవాలయం. తారకరామ థియేటర్ కూడా అమ్మ నాన్నగారి పేర్లు కలిసివచ్చేటట్లు కట్టిన దేవాలయం.  1978లో ‘అక్బర్ సలీం అనర్కాలి’తో ఈ థియేటర్ ని ప్రారంభించడం జరిగింది. తర్వాత 95లో కొన్ని అనివార్యకారణాల వలన మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇది మూడోసారి. ఈ థియేటర్ కి గొప్ప చరిత్ర వుంది. డాన్ సినిమా ఇక్కడ 525రోజులు ఆడింది. అలాగే నా సినిమాలు ‘మంగమ్మగారి మనవడు’, ‘ముద్దుల మావయ్య’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘అనసూయమ్మగారి అల్లుడు’.. ఇలా అన్నీ సినిమాలు అద్భుతంగా ఆడాయి. అలాగే మా అబ్బాయి మోక్షజ్ఞ తారకరామ తేజ పేరు కూడా ఈ థియేటర్ లోనే నాన్న గారు నామకరణం చేశారు. నారాయణ్ కె దాస్ నారంగ్ గారికి నాన్నగారి సన్నిహిత సంబంధాలు ఉండేవి. వాళ్ళ అబ్బాయి సునీల్ నారంగ్ ఆ పరంపరని ముందుకు తీసుకువెళ్తున్నారు. మేమంతా ఒక కుటుంబ సభ్యులం. వారి పర్యవేక్షణలో ఈ థియేటర్ నడపడం చాలా సంతోషంగా వుంది. ఈ అనుబంధం ఇలానే కొనసాగించాలి. సునీల్ నారంగ్ గారు అందరి అందుబాటు ధరలో టికెట్ రేట్లుని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైనది. ఎంతమంది ఎన్నిసార్లు థియేటర్ కి వచ్చి సినిమా చుస్తారనేది ఒక ప్రశ్న. ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటేషన్ వుంది. అందరం కలసి మంచి సినిమాలని అందించాలి. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్స్ కి వస్తారు. థియేటర్లో పొందే ఆనందం వేరు. మంచి సినిమాలు తీయడం మన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకత. పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు చలన చిత్ర పరిశ్రమ వర్ధిల్లి ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు  

సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. మహనీయుడు ఎన్టీఆర్ గారి పేరు మీద ఈ థియేటర్ వుంది. బాలకృష్ణ గారు ఇక్కడికి విచ్చేసి థియేటర్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది. ఈ థియేటర్ కి ఎంతో గొప్ప చరిత్ర వుంది. ఇక్కడ మళ్ళీ సిల్వర్ జూబ్లీలు పడతాయి. సరి కొత్త టెక్నాలజీతో థియేటర్ ని అద్భుతంగా నిర్మించాం.  600 సీటింగ్ తో హాల్లో పూర్తి రెక్లైనర్ సీట్లు ఏర్పాటు చేశాం. రేట్లు కూడా రిజనబుల్ గా పెట్టాం. మా నాన్నగారు, ఎన్టీఆర్ గారు చాలా మంచి స్నేహితులు. నందమూరి కుటుంబంతో మా అనుబంధం చాలా గొప్పది. భవిష్యత్ లో కూడా ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. బాలయ్య గారికి మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు.

ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న, శిరీష్, సదానంద్ గౌడ్, భరత్ నారంగ్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close