Movie ReviewsREVIEWS

ఒక చిన్న విరామం Review & Rating

రివ్యూ: ఒక చిన్న విరామం
నటీనటులు: సంజయ్ వర్మ, గరీమా సింగ్, పునర్నవి, నవీన్ తదితరులు
సినిమాటోగ్రఫర్: రోహిత్
సంగీతం: భరత్
నిర్మాత, దర్శకుడు: సందీప్ చేగూరి

ఎప్పటికప్పుడు కొత్త కథ కథనాలతో చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. అలాంటి కథతోనే ఇప్పుడు ఒక చిన్న విరామం కూడా ప్రయత్నించారు కొత్త టీం. సంజయ్ వర్మ, గరీమా సింగ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది చూద్దాం..

కథ:
దీపక్ (సంజయ్ వర్మ) ఓ బిజినెస్ మ్యాన్. అతని భార్య సమీరా (గరీమా సింగ్) అంటే ప్రాణం. కొందరు దుండగులు దీపక్ భార్యను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. చెప్పిన చోటుకి.. చెప్పిన సమయానికి వెళ్లకపోతే ప్రగ్నెంట్ అయిన దీపక్ భార్యను చంపేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. దాంతో డబ్బు తీసుకుని బయలుదేరుతాడు దీపక్. ఈ క్రమంలో అతని కార్ ట్రబుల్ ఇస్తుంది. అందుబాటులో ఏ వాహనం లేకపోవడంతో లిఫ్ట్ అడగడానికి ట్రై చేస్తాడు. ఈ నేపథ్యంలో బాల(నవీన్ నేని), మాయ (పునర్నవి) అనే జంట దీపక్‌కు వారి కారులో లిఫ్ట్ ఇస్తారు. ఎప్పుడూ గొడవ పడే బాల, మాయలు.. ఓ సారి డోస్ పెంచేస్తారు. ఈ క్రమంలోనే చేతికి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తుంది మాయ. చివరికి ఏమైంది.. దీపక్‌ను ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తారు.. భార్యను వదిలేస్తారా లేదా అనేది అసలు కథ..

కథనం:
ఈ రోజుల్లో చిన్న సినిమాల్లో చాలా విషయం ఉంటుంది. రాసుకునే కథలో కూడా కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు సందీప్ కూడా ఇదే చేయాలని ప్రయత్నించాడు. ఆ విషయంలో పర్లేదనిపించాడు కూడా. చాలా తక్కువ మంది మధ్య సాగే కథలా దీన్ని అల్లుకున్నాడు సందీప్. సినిమా మొదలైన దగ్గర్నుంచి చాలా వరకు ఓ కారు, ఇల్లు, రోడ్డు మీదే సన్నివేశాలు రాసుకున్నాడు. నిజానికి అందులో తప్పు కూడా లేదు.. ఎందుకంటే సందీప్ రాసుకున్న కథకు ఇవే సరిపోతాయి కూడా. అతను రాసుకున్న పాయింట్ దర్శకుడిగా ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. కొత్త దర్శకుడు కావడంతో అక్కడక్కడా ఆ తడబాటు కనిపించింది. ఫస్టాఫ్‌లో వేగం లేకపోయినా కూడా నవీన్ నేని మాత్రం అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ఆయన తన మార్క్ కామెడీతో అలరించాడు. ఇక ఇప్పటి వరకు డిఫరెంట్ రోల్స్ చేస్తూ వచ్చిన పునర్నవి ఈ సారి నవ్వించే ప్రయత్నం చేసాడు. నవీన్, పున్ను కెమిస్ట్రీ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగా అనిపించింది. సెకండాఫ్ అంతా సస్పెన్స్ పెట్టి క్లైమాక్స్ వరకూ తీసుకెళ్లాడు దర్శకుడు. కానీ ఆ తర్వాత ట్విస్టులు రివీల్ అయిన తర్వాత కాస్త సిల్లీగా అనిపించాయి. థ్రిల్లర్ సినిమాలకు లాజిక్‌లు చాలా అవసరం అన్న విషయాన్ని దర్శకుడు సందీప్ గాలికి వదిలేసినట్టు అనిపిస్తుంది. ఏదేమైనా కూడా చిన్న సినిమాను.. లిమిటెడ్ మెంబర్స్‌తో కొంతవరకు బాగానే చెప్పే ప్రయత్నం అయితే చేసాడు కానీ అది అంతగా వర్కవుట్ కాలేదేమో అనిపించింది. రాసుకున్న కథ బాగున్నా.. కథనం బాగోలేక సినిమా అంతగా ఆకట్టుకోలేదు. సీన్స్ పరంగా బాగున్నా.. సినిమా పరంగా ఒక చిన్న విరామం అంతగా మెప్పించలేకపోయింది.

నటీనటులు:
సంజయ్ వర్మ బాగా నటించాడు. బిజినెస్ మాన్‌గా పర్లేదనిపించాడు. ఇక హీరోయిన్ గరీమా సింగ్ ఎక్కువగా కనిపించదు. కానీ కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. పునర్నవి కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ట్రై చేసింది. ఇక నవీన్ నేని సినిమాలో బాగా చేసాడు. ‘కుమారి 21f’, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాల తర్వాత నవీన్ మరోసారి మెప్పించాడు. తన పాత్ర చాలా వరకు సినిమాకు రిలీఫ్ ఇచ్చింది. తన మార్క్ కామెడీతో అక్కడక్కడా నవ్వులు పూయించాడు నవీన్. సినిమాకు ఉన్న అతిపెద్ద పాజిటివ్స్‌లో ఈయన కూడా ఒకడు.

టెక్నికల్ టీం:
సినిమాటోగ్రఫర్ రోహిత్ ఈ చిత్రానికి ప్లస్ అయ్యాడు. విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమా రిచ్ నెస్ పెంచడంలో ఈయన పాత్ర కీలకమే. ఇక భరత్ సంగీతం పర్లేదు.. ఆర్ఆర్ బాగుంది. దర్శకుడిగా సందీప్ చేగూరి రాసుకున్న పాయింట్ బాగుంది కానీ కథనం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. స్క్రీన్ ప్లేపై ఇంకాస్త ఫోకస్ చేసుంటే ఒక చిన్న విరామం మంచి సినిమా అయ్యుండేది. ఇక నిర్మాతగా కూడా ఈ చిత్రానికి అన్నీ తానై నడిపించాడు సందీప్ చేగూరి. కథకు తగ్గట్లుగా అన్నీ బాగానే అరేంజ్ చేసుకున్నాడు.

చివరగా:
ఒక చిన్న విరామం.. కాస్త సస్పెన్స్.. కాస్త కామెడీ..

Rating : 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close